BRS నేతల ఇళ్లలో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బుధవారం (జూన్ 14న) భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల నివాసాలు, కార్యాలయాలతో పాటు వారి సమీప బంధువులు, స్నేహితల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు అధికారులు.

కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీలోని శేఖర్ రెడ్డి నివాసంలో ఐటి సోదాలు జరుగుతున్నాయి.జేసీ బ్రదర్స్ షోరూమ్స్ తో పాటు అమీర్ పేట్ లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్దన్ రెడ్డి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన కొత్తూరు పైపుల కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల సతీమనులు రెండు కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్నారు. ముగ్గురు కలిసి పలు కంపెనీలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పైళ్ళ శేఖర్ రెడ్డి బ్యాంకు లాకర్స్ ను సైతం ఐటీ అధికారులు ఓపెన్ చేశారు. జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ కేంద్రంపై దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతలపై ఐటీ, ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ఇది వరకే హెచ్చరించారు. గతంలో మంత్రులు గంగుల, మల్లారెడ్డి, ఎంపీ గాయత్రి రవి నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి వ్యాపారాలపైనా ఐటీ ఫోకస్ పెట్టింది. తాజాగా.. మరోసారి అధికార పార్టీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న సోదాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.