ఉత్తరప్రదేశ్ లో పొలంలో పడ్డ విమాన ఆయిల్ ట్యాంకులు

ఉత్తర్​ప్రదేశ్​ లోని సంత్ కబీర్​నగర్​ జిల్లాలో సోమవారం రైతులు పొలం పనులు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా విమానం నుంచి రెండు ఇంధన ట్యాంకులు పడిపోయాయి. దీంతో అక్కడి రైతులు భయంతో పరుగులుపెట్టారు. వాటి దగ్గరికి వెళ్లేందుకు ఎవ్వరు సాహసించలేదు. ఈ విషయాన్నీ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్పీ సత్యజిత్ గుప్తా ఘటనాస్థలికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని భారత వైమానిక దళానికి తెలియజేశారు. “వరి పొలంలో కలుపు తీస్తున్నాం. పెద్ద శబ్ధం వినిపించింది. ఏం జరిగిందోనని రైతులు, కూలీలు భయపడ్డారు. క్షిపణి లాంటివి రెండు పొలంలో పడ్డాయి. అవి పేలుతాయని భయపడ్డాం. అందుకే వాటి దగ్గరకు ఎవరూ వెళ్లలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. వారు పొలంలో పడినవి.. విమానం ఇంధన ట్యాంకులని చెప్పడం వల్ల ఊపీరి పీల్చుకున్నాం ‘ అని అక్కడి రైతులు తెలిపారు.

భారత వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల బాహ్య ఇంధన ట్యాంకును పైలట్‌.. నేలపైకి జారవిడిచేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.