విపక్షాల కూటమి పేరును ప్రకటించిన ఖర్గే

ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లుజివ్ అలయెన్స్ పేరును ప్రకటించిన ఖర్గే

‘I-N-D-I-A’ Name Finalised For 26-Party Opposition Coalition

న్యూఢిల్లీః విపక్ష ఫ్రంట్‌కు I-N-D-I-A (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్) అని నామకరణం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే మంగళవారం ప్రకటించారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశం ఈ రోజు సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన నేతలను ఉద్ధేశించి ఖర్గే మాట్లాడుతూ… విపక్షాల సమావేశానికి హాజరైన 26 పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ తదుపరి సమావేశం ముంబైలో ఉంటుందని తెలిపారు. తాము పాట్నాలో మొదటి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తమ కూటమిలో 16 పార్టీలు ఉన్నాయని, ఇప్పుడు బెంగళూరులో 26 పార్టీలు వచ్చాయన్నారు.

ఈ దేశ ప్రజల ప్రయోజనాలను రక్షించేందుకు తమ కూటమి ఏర్పడిందన్నారు. దేశాన్ని రక్షించాలనే ఉద్ధేశ్యంతో అందరం చేతులు కలిపామన్నారు. ఈ సమావేశంలో విపక్ష నాయకులు అందరూ మంచి సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూటమిలోని పార్టీల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుంటామన్నారు. పదకొండు మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

బిజెపి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. విపక్ష నాయకులపై సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందన్నారు. ప్రతిపక్షాలు అంటే మోడీకి భయం పట్టుకుందన్నారు. ఎన్డీయే సమవేశానికి 38 పార్టీలు వస్తున్నాయని చెబుతున్నారని, కానీ ఆ పార్టీలు అన్నీ రిజిస్టర్ అయినవేనా? అని ప్రశ్నించారు. పేరు, గుర్తు లేని పార్టీలతో ఎన్డీయే సమావేశం జరుగుతోందన్నారు.