మాజీ సీఎం రబ్రీదేవిని ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు

ఇవి సోదాలు, దాడులూ కాదని వెల్లడి

CBI Questioning Rabri Devi At Her Patna Home In Land-For-Jobs Case

పాట్నాః ఐఆర్‌సీటీసీ ఉద్యోగాల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ కేసులో వారం రోజుల క్రితం రబ్రీదేవికి, లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం పాట్నాలోని వారి ఇంటికి వెళ్లిన అధికారులు.. రబ్రీదేవిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలుత సీబీఐ సోదాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కేవలం రబ్రీదేవి స్టేట్ మెంట్ మాత్రమే తాము రికార్డు చేసుకుంటున్నామని సీబీఐ వర్గాలు తెలిపాయి. అంతే తప్ప ఇవి దాడులు, సోదాలూ కాదని చెప్పాయి. ఈ మేరకు ముందుగా రబ్రీదేవి నుంచి అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నట్లు వెల్లడించాయి. తదుపరి విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి రబ్రీదేవిని పిలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

2004 నుంచి 2009 మధ్య రైల్వేశాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేశారు. నాడు రైల్వే రిక్రూట్‌మెంట్‌లో కుంభకోణం జరిగింది. రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వద్ద నుంచి వ్యవసాయ భూములు, ప్లాట్లు తీసుకున్నట్లుగా లాలూ కుటుంబంపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మిసా భారతి, హేమాపై కేసు నమోదైంది. 2022 మేలో మొత్తం 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లాలూ ప్రసాద్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు స్పెషల్ డ్యూటీ అధికారిగా పని చేసిన భోలా యాదవ్‌ను 2022 జులైలో సీబీఐ అరెస్టు చేసింది.