రిటైర్మెంట్ కథనాలపై స్పందించిన బాక్సర్ మేరీ కోమ్

కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాల్లో నిజంలేదని వెల్లడి

I haven’t announced retirement yet, says boxer Mary Kom

న్యూఢిల్లీః భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించిందంటూ గురువారం ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను ఆమె ఖండించారు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడు ప్రకటించాలనుకున్నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని తెలిపారు. తాను రిటైర్మెంట్ ప్రకటించానంటూ కొన్ని మీడియా కథనాలు వస్తున్నాయని, అందులో నిజం లేదని ఆమె వివరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

జనవరి 24న తాను దిబ్రూఘర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని, అందులో పిల్లలను ప్రోత్సహిస్తూ మాట్లాడానని చెప్పారు. తనకు ఇప్పటికీ క్రీడల్లో ఇంకా సాధించాలనే కోరిక ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌లో వయోపరిమితి కారణంగా పాల్గొనడానికి వీలుండదని చెప్పానని అన్నారు. వయోపరిమితి ఉన్నప్పటికీ తన ఆటను కొనసాగించగలనని, ఇప్పటికీ తాను ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నానంటూ పిల్లలకు చెప్పానని క్లారిటీ ఇచ్చారు. తాను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు కచ్చితంగా అందరికీ తెలియజేస్తానని అన్నారు.