ఉప ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ చేయలేను – ఉత్తమ్

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న గొడవలు కార్య కర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఓ పక్క మరోసారి మునుగోడు లో కాంగ్రెస్ ను గెలిపించాలని కార్య కర్తలు కష్టపడుతుంటే..మరోపక్క పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరు కాంగ్రెస్ పార్టీ మునుగోడు లో గెలవదని చెపుతుంటే..మరోపక్క టీపీసీసీ అధ్యక్షుడిగా తప్పించాలనే కుట్రలు జరుగుతున్నాయని చెప్పడం కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..వివాదాలన్నీ కూడా ఏఐసీసీ పరిధి చూసుకుంటుందని అన్నారు. మునుగోడు బైపోల్, మరోవైపు రాహుల్ గాంధీ పాదయాత్ర ఉన్నాయని.. ఈ సమయంలో కాంట్రవర్సీ విషయాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. తనది నల్గొండ జిల్లా అయినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలవబోతున్నారని ఆ విషయం గురించి మాట్లాడదామని ఎంపీ ఉత్తమ్ కుమార్ అన్నారు. ఎవరు ఏం మాట్లాడినా మునుగోడు ప్రజలు పట్టించుకోరని , 8 ఏళ్లుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు ప్రజలకు ఏం చేశాయని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.