ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ స్కామ్ లో రాజకీయ నేతల పేర్లే ప్రముఖంగా వినిపించాయి. కానీ ఇప్పుడు హైదరాబాదీ సైంటిస్ట్ పేరు బయటకు రావడం కీలకంగా మారింది. స్కాంలో నిధులు మళ్లింపుపై ఈడీ ఛార్జ్ షీట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. దుబాయ్ కంపెనీతో పాటు ‘ ఫై ‘ కంపెనీ కి నిధులు మళ్లించారు. ఫై కంపెనీకి ఫౌండర్‌గా ప్రవీణ్ ఉన్నారు. సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ పాత్రపై లోతుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. స్కాంలో నిధుల్ని హవాలా రూపంలో ప్రవీణ్ కుమార్ కంపెనీకి మళ్లించినట్టు ఈడీ అభియోగం మోపుతోంది.

గతంలో ప్రవీణ్ గొరకవి ఇంటిపై ఈడీ దాడులు చేపట్టగా.. ఈ దాడుల్లో రూ.24 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన సీఏ బుచ్చిబాబుకు సన్నిహితుడిగా ప్రవీణ్ గొరకవి ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రవీణ్ పాత్రపై ఈడీ లోతుగా దర్యాప్తు చేపడుతోంది. దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో అనేకమంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు చెందిన నేతలు, రాజకీయ నేతలతో సంబంధాలు కలిగి ఉన్న వ్యాపారవేత్తలపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన బోేయినపల్లి అభిషేక్‌ రావును గతంలో సీబీఐ అరెస్ట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ కేసులో ఇప్పటికే సీబీఐ నోటీసులు జారీ చేసి ప్రశ్నించింది.