హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత

మునుగోడు ఉప ఎన్నిక వేళ..హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. గత మూడు రోజులుగా కోట్లలో హవాలా డబ్బును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మొన్న, నిన్న జూబ్లీహిల్స్ వెంకటగిరిలో రూ. 54 లక్షలు, చాంద్రాయణగుట్టలో రూ. 79 లక్షలు, జూబ్లీహిల్స్‌లో రూ. 2.5 కోట్లు పట్టుబడగా..ఈరోజు కూడా నగరంలో భారీ ఎత్తున నగదు పట్టుబడడం సంచలనంగా మారింది. వారం రోజుల వ్యవధిలోనే సుమారు 10 కోట్లకు పైగా హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకోవటం చర్చనీయాంశం అయింది. పెద్దఎత్తున తరలిస్తోన్న ఈ సొమ్ము ఎవరి ఆదేశాలతో తరలిస్తున్నారు.. ఎక్కడికి తరలిస్తున్నారనేది తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.

మారియట్ హోటల్ కేంద్రంగా భారీగా హవాలా నగదు తరలిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, మరియు గాంధీనగర్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మారియట్ హోటల్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించగా, రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల లెక్కల్లో చూపని నగదు పట్టుబడింది. కర్మన్ ఘాట్ న్యూ బాలాజీ నగర్ కు చెందిన గంటా సాయి కుమార్ రెడ్డికి, కె వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 3.5 కోట్ల నగదు ఇచ్చి సైదాబాద్ లో ఉండే బాలు మహేందర్ కు అందజేయాలని సూచించాడు. దీంతో సాయి కుమార్ రెడ్డి తన స్నేహితులైన మహేష్, సందీప్ కుమార్, మహేందర్, అనుష్ రెడ్డి, భరత్ తో కలిసి రెండు కార్లలో నగదును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ సొమ్ముకు సరైన ఆధారాలు చూపించక పోవడంతో పోలీసులు హవాలా కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.