చిత్రసీమలో మరో విషాదం : కరోనా తో ప్రముఖ నటుడు కన్నుమూత

దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి తగ్గినప్పటికీ..చిత్రసీమలో మాత్రం కరోనా మరణాలు తగ్గడం లేదు. ఎవరో ఒకరు కరోనా కు బలైవుతున్నారు. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌(61) మృతిచెందారు. కరోనా బారిన పడిన ఆయనను 20 రోజుల క్రితం చెన్నైలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కరోనాతో పోరాడుతూ.. బుధవారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

1995లో కోలంగల్‌ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. దిల్, తెన్నవాన్, వీరమ్, సలీమ్, ఎన్నై అరిందాల్, నానుమ్ రౌడీ దాన్, వేదాలం, విశ్వాసం, కాంచన -3, అయోగ్య లాంటి చిత్రాల్లో నటుడిగా మెప్పించారు. మాసిలమణి(2009) చిత్రానికి దర్శకత్వం వహించి, తొలి సినిమాతోనే హిట్‌ కొట్టాడు. . ఇటీవల విడుదలైన ఆర్య ‘టెడ్డీ’ సినిమాలో హీరోయిన్ సాయేషా సైగల్ తండ్రిగా ఆయన నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న విశాల్ ‘సామాన్యుడు’ సినిమాలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మనోహర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.