ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా మారిన హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్

హైదరాబాద్ జీనోమ్‌ వ్యాలీలో భారత్ సీరం అండ్ వాక్సిన్స్ సంస్థ కేంద్రం ఏర్పాటు

Hyderabad has become the vaccine capital of the world: Minister KTR

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా మారిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ విషయాన్ని తాను గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న భారత్ సీరమ్స్ అండ్ వాక్సిన్స్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో తమ బయో-ఫార్మాస్యూటికల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మంత్రి కెటిఆర్ గురువారం దీనికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా మారిన హైదరాబాద్‌ భారత్ సీరమ్స్‌కు స్వాగతం పలుకుతుందన్నారు. దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని ప్రకటించారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారిందని గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయని కెటిఆర్ తెలిపారు.