మీ ఫోన్‌కూ ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చిందా?.. ఫోన్ ఒకేసారి పెద్దగా మోగితే.. భయపడొద్దు!

ప్రయోగంలో భాగంగా సందేశాలు పంపిస్తున్న టెలికం శాఖ

dont-panic-if-your-mobile-phone-vibrated-with-bigger-sound

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా గురువారం కొందరు మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊహించని అనుభవం ఎదురైంది. వారి ఫోన్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్దగా మోత పెట్టాయి. అలారమ్ మాదిరిగా అలా రింగ్ సౌండ్ వస్తూ, ఫోన్ వైబ్రేట్ కావడంతో ఏమైందో తెలియక అయోమయానికి, భయాందోళనకు గురయ్యారు. అవగాహన లేని వారు ఫోన్ కు దూరంగా వెళ్లడం జరిగింది. ఆఫ్ చేసే వరకు ఆ అలర్ట్ మోగుతూనే ఉంది. కాకపోతే దీన్ని కేంద్ర టెలికం శాఖ పంపించింది. ట్రయల్ లో భాగంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సహకారంతో కేంద్ర టెలికం శాఖ మొబైల్ ఫోన్లకు ఈ అలర్ట్ ను పంపించింది. దీనిపై గురువారం ఉదయమే మొబైల్ ఫోన్ వినియోగదారులు అందరికీ ఎస్ఎంఎస్ రూపంలో టెలికం శాఖ ఓ సందేశాన్ని పంపించింది.

‘‘మీ మొబైల్ లో అత్యవసర పరిస్థితికి సంబంధించి టెస్ట్ సందేశాన్ని (ప్రయోగాత్మక సందేశాన్ని) భిన్నమైన శబ్దంతో, వైబ్రేషన్ తో అందుకోవచ్చు. దయచేసి భయపడకండి. ఇది నిజమైన అత్యవసర పరిస్థితిని సూచించదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సహకారంతో భారత టెలికం శాఖ ఈ సందేశాన్ని పంపిస్తోంది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే ఈ ట్రయల్ సందేశాన్ని పంపిస్తున్నాం’’అని ఎస్ఎంఎస్ రూపంలో అప్రమత్తం చేసింది. భవిష్యత్తులో అత్యవసర సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా టెలికం శాఖ ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.