జ్ఞానవాపి మసీదు కేసుపై విచారణ వాయిదా

Varanasi court adjourns hearing of plea seeking worship of ‘Shivling’ in Gyanvapi mosque premises to Nov 14

న్యూఢిల్లీః జ్ఞానవాపి మసీదు వివాదంపై దాఖలైన పిటిషన్‌పై వారణాసిలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను వాయిదా వేసింది. సంబంధిత న్యాయమూర్తి నేడు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో హాజరుకానందున తదుపరి విచారణను నవంబర్‌ 14వ తేదీకి వాయిదా వేశారు. మసీదు ప్రాంగణంలో గుర్తించిన శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. జ్ఞానవాపీ మసీదు వజుఖానాలో వీడియో సర్వే సమయంలో బయటపడ్డ శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేలా ఆదేశాలు వెలువరించాలని హిందూ పక్షాలు సెప్టెంబరు 22న కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, ఇది శివలింగం కాదని, ఫౌంటెయిన్ అని ముస్లింలు వాదిస్తున్నారు.

కాగా, మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ గతంలో ఐదుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కమిటీ వీడియో సర్వే నిర్వహించింది. ముస్లిం పక్షాల మతపరమైన ప్రార్ధనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం వాదనను వారణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది. హిందువుల తరఫు పిటిషన్ ను వారణాసి కోర్టు విచారించడానికి స్వీకరించింది. మసీదు అంజుమన్ కమిటీ ( ముస్లిం పక్షం) వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా పడింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/