హిమాచల్‌ప్రదేశ్‌లో వర్ష బీభత్సం..రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన ప్రభుత్వం

ఇప్పటి వరకు 77 మంది మృత్యువాత

Himachal Pradesh.. State Calamity Declared, CM Urges Centre to label .National Calamity. as Rains continue to wreak havoc

సిమ్లాః వర్షబీభత్సంతో అతలాకుతలమైన హిమాచల్‌ప్రదేశ్ దారుణంగా నష్టపోయింది. శుక్రవారం నాటికి వర్షాల కారణంగా రాష్ట్రంలో 77 మంది మరణించారు. రూ. 10 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న సమ్మర్ ‌హిల్ ప్రాంతంలో కూలిపోయిన శివాలయం శిథిలాల నుంచి నిన్న మరో మృతదేహాన్ని వెలికి తీశారు. మరో నాలుగు మృతదేహాలు శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. భారీ వర్షాల కారణంగా మానవ ప్రాణ, ఆస్తినష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం మొత్తాన్ని ‘ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం’గా ప్రకటించింది. ఆదివారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా సిమ్లా సహా పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయ కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగుతున్నట్టు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు.