తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు

బెంగళూరులో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

fire-broke-out-in-telangana-express-and-udyan-express

ముంబయిః మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును నాగ్‌పూర్‌ సమీపంలో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు బోగి నుంచి కిందకు దిగి పరుగులుపెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మరోవైపు బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న (కేఎస్ఆర్) రైల్వే స్టేషన్ లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ లో హాల్ట్ చేసిన ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ మొత్తం పొగ నిండిపోయి గందరగోళం నెలకొంది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

ఉదయన్ ఎక్స్ ప్రెస్ శనివారం ఉదయం 5:45 గంటలకు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ కు చేరుకుందని అధికారులు తెలిపారు. ప్లాట్ ఫాం నెంబర్ 3 పైన హాల్ట్ చేశామని వివరించారు. అయితే, ఉదయం 7:10 గంటల ప్రాంతంలో ట్రైన్ లోని బీ 1, బీ 2 కోచ్ లలో పొగలు రావడం మొదలైందని తెలిపారు. క్షణాల వ్యవధిలోనే మంటలు ఎగసిపడ్డాయని, దీంతో ప్లాట్ ఫాం పైనున్న ప్రయాణికులను అక్కడి నుంచి తరలించామని చెప్పారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు ఫైరింజన్లతో వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పేశారని సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్వో అనీశ్ హెగ్డే మీడియాకు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమేంటనే విషయంపై విచారణ జరిపిస్తున్నట్లు తెలిపారు.