సంబరాల్లో తాలిబన్లు..సైనికులతో కూడిన అమెరికా చివరి విమానం బయలుదేరింది

ఇక అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వెళ్లింది. నిన్నటి వరకు అమెరికా సైనికులు..తమ దేశ పౌరులను పంపించే పనిలో ఉండగా..ఆగస్టు 31 తో గడువు పూర్తి కావడం తో సోమవారం అర్ధరాత్రి అఫ్గానిస్థాన్​ నుంచి అమెరికా చిట్టచివరి విమానం సీ-17 వెళ్లిపోయింది. ఈ విమానంలో అమెరికా కమాండర్‌, రాయబారి వెళ్లిపోయారు. అఫ్గాన్‌ గడ్డ నుంచి 20 ఏళ్ల అనంతరం అమెరికా రక్షణ దళాలు పూర్తిగా వెనుదిరిగాయి. కాబుల్‌ నుంచి ఆశించినంత మందిని తరలించలేకపోయామని అధికారులు చెప్పుకొచ్చారు.

ఇస్లామిక్ తాలిబన్ల అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైన యుద్ధం.. మళ్లీ వారి పాలనతోనే ముగియడం గమనార్హం. అమెరికా యుద్ధం ముగియడంతో మంగళవారం తెల్లవారుజామున కాబూల్‌లో వేడుకలకు గుర్తుగా గాల్లోకి కాల్పులు జరిగాయి. ఈ సంఘటనపై తాలిబాన్ సీనియర్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ…’అమెరికా సైన్యం కాబూల్‌ను వీడింది. ఇప్పుడు మా దేశానికి పూర్తి స్వాంత్రత్య్రం లభించింది.’ అని పేర్కొన్నారు. అమెరికా సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇక ఆఫ్గన్‌ను వీడాలనుకునేవారికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఇన్నాళ్లు కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అమెరికా,నాటో దళాల ఆధీనంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆఫ్గన్ లేదా ఇతర దేశస్తుల తరలింపు ప్రక్రియ సాధ్యపడింది. కానీ ఇప్పుడు విమానాశ్రయం తాలిబన్ల నియంత్రణలో ఉంటుంది కాబట్టి… ఇక ఏ దేశం అక్కడ అడుగుపెట్టే సాహసం చేయదు. శరణార్థులుగా వేరే దేశాలకు వెళ్లాలనుకున్న ఆఫ్గన్లకు అక్కడే ఉండిపోవడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.