హెన్రీ నికోల్స్‌ అజేయ సెంచరీ

న్యూజిలాండ్‌ 294/ 6

Henry Nicholls Unbeaten Century
Henry Nicholls

వెల్లింగ్టన్‌ : మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హెన్రీ నికోల్స్‌ అజేయ సెంచరీతో వెస్టిండీస్‌తో బేసిన్‌ రిజర్వ్‌లో శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టు తొలిరోజున న్యూజిలాండ్‌ జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. వెస్టిండీస్‌ బౌలర్ల దిశతప్పిన బౌలింగ్‌కు తోడు ఫీల్డింగ్‌ తప్పిదాలతో నికోల్స్‌ సెంచరీ చేయడంతో న్యూజిలాండ్‌ తొలి రోజు ఆట ముగిసేసరికి ఆరు వికెట్లకు 294 పరుగులు చేసింది.

నికోల్స్‌ ఒక సిక్సర్‌, 15 ఫోర్లతో 117 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టులలో అతనికిది ఆరో సెంచరీ కాగా, 2019 తరువాత మళ్లీ సెంచరీ చేయడం ఇదే.

ఇన్నింగ్స్‌ ఆరంభంలో వెస్టిండీస్‌ బౌలర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు సంధించడంతో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు తీసేందుకు కష్టపడ్డారు. తరువాత బౌలర్లు గ్రిప్‌ కోల్పోవడంతో బ్లండెల్‌, లాథమ్‌ స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు.

బ్లండెల్‌ కుదురుకుంటున్న తరుణంలో గాబ్రియల్‌ తొలి వికెట్‌ పడగొట్టి విండీస్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే లాథమ్‌, విల్‌ యంగ్‌ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. కానీ లాథమ్‌ను చమర్‌, రాస్‌ టేలర్‌ను గాబ్రియల్‌ వెంటవెంటనే అవ్ఞట్‌ చేయడంతో స్కోరు నిదానించింది.

ఈ తరుణంలో నికోల్స్‌, వాట్లింగ్‌ అర్ధసెంచరీ భాగస్వామ్యంతో మళ్లీ ఇన్నింగ్స్‌ను గాడిలోపెట్టారు. అయిదో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యంతో కివీస్‌ ఇన్నింగ్స్‌కు జీవం కలిగింది. వాట్లింగ్‌ 51 బంతుల్లో 30 పరుగులు చేసి అల్జరి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు.

తరువాత వచ్చిన డారిల్‌ మిచెల్‌తో కలిసి నికోల్‌స మరో ఫలవంతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. మిచెల్‌ అండతో ఆరో వికెట్‌కు నికోల్స్‌ 83 పరుగులు జోడించాడు. తొలి రోజు ఆట కొద్ది సమయంలో ముగుస్తుందనగా డారిల్‌ 42 పరుగులకు నిష్క్రమించాడు.

ఈ నేపథ్యంలో నికోల్స్‌ తన సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆటను నిలిపివేసే సమయానికి నికోల్స్‌117 పరుగులతో అజేయంగా నిలవగా, న్యూజిలాండ్‌ 6 వికెట్లకు 294 పరుగులు చేసింది. షానన్‌ గాబ్రియల్‌ 3, చమర్‌ హోల్డర్‌ 2 వికెట్లు దక్కించుకున్నారు.

రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌నుంచి తప్పుకోవడంతో లాథమ్‌ నేతృత్వం వహించాడు.

స్కోర్‌బోర్డ్‌ : న్యూజిలాండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ – టామ్‌ లాథమ్‌ సి జోషువా డిసిల్వ బి చెమర్‌ 27, టామ్‌ బ్లండెల్‌ బి గాబ్రియల్‌ 14, విల్‌ యంగ్‌ సి హోల్డర్‌ బి గాబ్రియల్‌ 43, రాస్‌ టేలర్‌ సి జోషువా డిసిల్వ బి గాబ్రియల్‌ 9, హెన్రి నికోల్స్‌ బ్యాటింగ్‌ 117, బిజె వాట్లింగ్‌ బి అల్జరి జోసఫ్‌ 30, డారిల్‌ మిచెల్‌ ఎల్బీ చెమర్‌ 42, కీల్‌ జేమిసన్‌ బ్యాటింగ్‌ 1, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం(84 ఓవర్లలో 6 వికెట్లకు)294.

వికెట్ల పతనం : 1-31, 2-63, 3-78, 4-148, 5-203, 6-286.
బౌలింగ్‌ : షానన్‌ గాబ్రియల్‌ 18-5-57-3; జాసన్‌ హోల్డర్‌ 22-5-62-0; అల్జరి జోసఫ్‌ 17-2-65-1; చెమర్‌ హోల్డర్‌ 18-1-65-2; రోస్టన్‌ చేజ్‌ 9-1-37-0.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/