నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైస్సార్సీపీ కొత్త ఇంఛార్జ్ రేసులో ఆ ఇద్దరు..?

మొన్నటి వరకు ఓలెక్క…ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ఉంది వైస్సార్సీపీ పార్టీ పరిస్థితి. పార్టీ లో అసమ్మతి గళం మొదలైంది. ఒక్కొక్కరిగా అధిష్టానం ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ముందుగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అధిష్టానం ఫై విమర్శలు చేయగా.. ఆ తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ..వైస్సార్సీపీ లో ఉండలేను అని తేల్చి చెప్పారు. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి అసమ్మతి తో వైఎస్సార్‌సీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే వెంకటగిరి ఇంఛార్జ్ బాధ్యతల్ని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి అప్పగింగా.. నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ నియామకంపై కూడా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి ఈ బాధ్యతలు అప్పగిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన 2019 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. చివరి నిమిషంలో అనూహ్యంగా వైస్సార్సీపీ లో చేరి నెల్లూరు ఎంపీగా గెలిచారు. ఆయనకు నియోజకవర్గంలో పాత పరిచయాలు ఉన్నాయి. అంతేకాదు ఆదాల కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేశారు. జిల్లాలో మంచి పట్టు ఉన్న నేతగా గుర్తింపు ఉంది. ఆనం విజయ్‌కుమార్ రెడ్డికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరిచయాలు ఉన్నాయి. దీంతో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. మరి అధిష్టానం ఎవరికీ ఛాన్స్ ఇస్తుందో చూడాలి.