ముంబయి లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు..ఎల్లోఅలర్ట్ జారీ

heavy-rains-lash-parts-of-mumbai-weather-department-issues-yellow-alert-for-coming-days

ముంబయిః నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ముంబయి లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రానున్న నాలుగైదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, ముంబయి నగర వ్యాప్తంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో జూన్ 26-27 తేదీల్లో నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రాయ్ గఢ్, థానే, పాల్ఘర్, ముంబై ప్రాంతాల్లో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ముంబయి వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 11న రుతుపవనాలు తీరప్రాంతం రత్నగిరికి చేరుకున్నప్పటికీ.. బిపర్జాయ్ తుఫాను కారణంగా 10 రోజులు ఆలస్యంగా 23-25 తేదీల మధ్య రుతుపవనాలు నగరంలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ ముందుగానే అంచనా వేసింది. కాగా, ఇన్ని రోజులు తీవ్ర ఉక్కపోతకు గురైన నగర వాసులు తాజా వర్షంతో ఉపశమనం పొందుతున్నారు. చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ మేరకు ‘హ్యాపీ రెయినీ డే’ అంటూ వర్షానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు.