మ‌ణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. మంత్రి గోడౌన్‌కు నిప్పుపెట్టిన దుండగులు

manipur-ministers-private-godown-set-ablaze-by-mob-in-fresh-violence

ఇంఫాల్ : మణిపూర్ మే 3 నుంచి కుకీ వ‌ర్గాల మ‌ధ్య చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల‌తో నెల‌కొన్న ఉద్రిక్త‌త కొన‌సాగుతూనే ఉంది. ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని చింగ‌రేల్‌లో మ‌ణిపూర్ మంత్రి ఎల్ సుసింద్రో ప్రైవేట్ గోడౌన్‌కు కొంద‌రు నిప్పంటించారు. శుక్ర‌వారం రాత్రి ఆందోళ‌న‌కారులు ఈ గోడౌన్‌కు నిప్పంటించ‌డంతో ఇది పూర్తిగా ద‌గ్ధ‌మైంద‌ని పోలీసులు తెలిపారు. ఇదే జిల్లాలోని ఖురై ప్రాంతంలో మ‌ణిపూర్ ఆహార శాఖ మంత్రి నివాసానికి కొంద‌రు నిప్పంఇంచే ప్ర‌య‌త్నం చేశారు.

స‌కాలంలో పోలీసులు వీరిని అడ్డ‌గించ‌డంతో వారి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. మంత్రి నివాసం నుంచి ఆందోళ‌న‌కారుల‌ను చెద్ద‌ర‌గొట్టేందుకు పోలీసులు ప‌లు మార్లు భాష్ప వాయు గోళాల‌ను ప్రయోగించారు. ఈ ఘ‌ట‌న‌ల్లో ఎవ‌రికి ప్రాణ న‌ష్టం వాటిల్ల‌క‌పోవ‌డంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లతో నిరాశ్ర‌యులైన వారికి ఇండ్ల‌ను నిర్మించేందుకు అవ‌స‌ర‌మైన స్ధ‌లాల‌ను మ‌ణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ప‌రిశీలించిన కొద్దిసేప‌టికే మంత్రి గోడౌన్‌, నివాసంపై దాడులు జ‌ర‌గ‌డం విశేషం.

మ‌ణిపూర్‌లో అల్ల‌ర్లు, అల‌జ‌డి నెల‌కొన్న‌ప్ప‌టి నుంచి రాష్ట్ర మంత్రి నెంచ కిపెన్ అధికార నివాసానికి జూన్ 14 కొంద‌రు నిప్పంటించారు. మ‌రుస‌టి రోజు కేంద్ర మంత్రి ఆర్‌కే రంజ‌న్ సింగ్ నివాసంపై దాడిచేసిన దుండ‌గ‌లు ఆయ‌న ఇంటిని ద‌గ్ధం చేసేందుకు ప్ర‌యత్నించారు. మ‌ణిపూర్‌లో మెయిటీ, కుకీ వ‌ర్గాల మ‌ధ్య చెల‌రేగిన‌ అల్ల‌ర్లలో ఇప్ప‌టివ‌ర‌కూ వంద మందికి పైగా మ‌ర‌ణించ‌గా, పెద్దసంఖ్య‌లో ఇండ్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. త‌మ‌కు ఎస్టీ హోదా క‌ల్పించాల‌న్న మెయిటీ వ‌ర్గీయులు డిమాండ్‌ను వ్య‌తిరేకిస్తూ మే 3న గిరిజ‌న సంఘీభావ మార్చ్ జ‌రిగిన‌ప్ప‌టి నుంచి అల్ల‌ర్లు చెల‌రేగాయి.