భారీ వర్షాలు.. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత

Heavy rains.. 16 gates of Sriram Sagar project lifted

నిజామబాద్‌: గత రెండు రోజులుగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 75,100 క్యూసెక్కుల వరద వస్తుందని. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 64,038 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో మొత్తం 90 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అయితే పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా మారింది. జిల్లాలో ఉన్న మరో జలాశయమైన రామడుగు ప్రాజెక్టులోకి 12,285 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో 1278.3 అడుగులకు నీటిమట్టం చేరింది.

ఇక కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 29,800 క్యూసెక్కుల వరత వస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నిటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17 టీఎంసీల నీరు ఉన్నది.

కాగా, కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదయింది. గాంధారిలో 14.4 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 9.9, నాగిరెడ్డిపల్లిలో 9.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో జుక్కల్‌-బస్వాపూర్‌ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.