రుతుపవనాల ప్రభావం..భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

Heavy rain warning across India; alerts issued in Mumbai, Uttarakhand, Himachal

న్యూఢిల్లీః రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజుల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

జులై 5వ తేదీ వరకూ ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. డెహ్రాడూన్ తోపాటు ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని రోజులపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను అమర్ నాథ్ యాత్ర మార్గంలో, సున్నితమైన ప్రాంతాల్లో మోహరించినట్లు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) వి.మురుగేషణ్ తెలిపారు. మరోవైపు ఇప్పటికే ఆ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న ఐదు రోజుల్లో ఆ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గోవా పనాజీ, మహారాష్ట్రకు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, థానే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో పాల్ఘర్, రాయ్ గఢ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ముంబైలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.