జహీరాబాద్‌లో అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ ప్రారంభం

hatsun starts its operations in zaheerabad

దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ జహీరాబాద్‌లో ప్రారంభమైంది. ఇప్పటికే తెలంగాణ లో ఎన్నో పెద్ద, పెద్ద కంపెనీ లు వచ్చి తమ బిజినెస్ ను విస్తరింపచేయగా..తాజాగా సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్ లో హాట్సన్ నూతనంగా ఏర్పాటు చేసిన చాకొలెట్, ఐస్ క్రీమ్ ఉత్పత్తి ప్లాంట్ గురువారం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్… రాష్ట్రం నూతన రికార్డును నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీని జహీరాబాద్‌లో ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ ట్వీట్ చేసారు. హ‌ట్స‌న్ కంపెనీ ద్వారా రోజుకు 7 ట‌న్నుల చాకోలెట్స్, 100 ట‌న్నుల ఐస్‌క్రీంను ప్రాసెస్ చేసే ప్లాంట్ల ప్రారంభోత్స‌వం సంతోషాన్నిస్తుంద‌న్నారు. ప్ర‌సిద్ధి గాంచిన‌ అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జ‌హీరాబాద్‌లో ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఈరోజు ఇండియాలో ఐస్ క్రీమ్స్ కు పుట్టినిల్లుగా జ‌హీరాబాద్ నిలిచింద‌ని పేర్కొన్నారు. తెలంగాణలో జ‌రుగుతున్న శ్వేత విప్ల‌వానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ఈ యూనిట్ ప్ర‌తి రోజు 10 ల‌క్ష‌ల లీట‌ర్ల పాల‌ను కొనుగోలు చేస్తుంద‌ని, దీని వ‌ల్ల 5 వేల మంది పాడి రైతులు లాభం పొందుతున్నార‌ని తెలిపారు. 1500 మందికి ఉపాధి కూడా ల‌భిస్తుంద‌ని కేటీఆర్ చెప్పారు. రూ.400 కోట్ల పెట్టుబడితో హాట్సన్ జహీరాబాద్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.