కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ కి క్షమాపణలు చెప్పిన ఎలాన్‌ మస్క్‌

Elon Musk Apologizes For Not Meeting Piyush Goyal At Tesla Factory: ”It Was An Honour…”

న్యూఢిల్లీః ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్విట్టర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ , కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ కు క్షమాపణలు చెప్పారు. కేంద్ర మంత్రి ప్రస్తుతం కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్‌ కార్ల తయారీ టెస్లా ప్లాంట్‌ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లోని విద్యుత్‌ కార్ల తయారీని పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కేంద్ర మంత్రి ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

‘కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్‌ లో గల అత్యాధునిక టెస్లా విద్యుత్‌ కార్ల తయారీ కేంద్రాన్ని సందర్శించాను. ఇక్కడ ప్రతిభావంతులైన భారతీయ ఇంజినీర్లు, ఫైనాన్స్‌ నిపుణులు సీనియర్‌ స్థానాల్లో పనిచేస్తున్నారు. వారిని చూడటం ఆనందాన్ని కలిగించింది. టెస్లా అద్భుత ప్రయాణంలో వారు అందిస్తున్న సహకారం చూసి చాలా ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు. అయితే, ఈ పర్యటనలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ను మిస్‌ అవుతున్నట్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

అయితే పియూష్‌ గోయల్‌ పోస్ట్‌కు మస్క్‌ స్పందించారు. ‘మీరు టెస్లాను సందర్శించడం గౌరవంగా ఉంది. ఈ రోజు కాలిఫోర్నియాకు రాలేకపోతున్నందుకు క్షమాపణలు కోరుకుంటున్నా. త్వరలోనే మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.