చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు

చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంగళవారం మంత్రులు హరీశ్‌రావు, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. 36 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని.. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చౌటుప్పల్‌ ఆస్పత్రితో పాటు నియోజకవర్గంలోని 4 పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని తెలిపారు.

2018లో యాదాద్రి జిల్లాకు ఎయిమ్స్‌ను కేటాయిస్తే నాలుగేళ్ల తర్వాత మోడీ వచ్చి శంకుస్థాపన చేశారని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఒక్క ఎయిమ్స్‌ కేటాయించినందుకే బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చేతలు తక్కువ.. ప్రచారం ఎక్కువ అన్నట్లుగా బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 8 వైద్య కళశాలలు ప్రారంభించిందని గుర్తు చేశారు. ఎయిమ్స్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని పేర్కొన్నారు.

ఇక చౌటుప్పల్‌లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చడం ద్వారా సమీప ప్రాంతాల్లో ప్రజలకు నయాపైసా ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్యసేవలు అందనున్నాయి. ఈ దవాఖానలో ప్రతి నిత్యం సుమారు 300 మందికిపైగా ఓపీ సేవలు పొందుతున్నారు. నెలకు 50 వరకు ప్రసవాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా 65వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు సైతం ఇక్కడేకు వస్తుంటారు. అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో లేక రోగులు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. వీటి దృష్ట్యా మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సమయంలో చండూర్‌ బహిరంగ సభలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన కావాలని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అభ్యర్థన మేరకు వంద పడకలకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేసారని హరీష్ రావు తెలిపారు.