ప్రముఖ చిత్రకారుడు బాలి ఇకలేరు

కార్టూనిస్టుగా తెలుగు పత్రికా రంగాన్ని కొన్ని దశాబ్దాలపాటు తన బొమ్మలతో ఉర్రూతలూగించిన ప్రముఖ చిత్రకారులు బాలి సోమవారం అర్థరాత్రి అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న బాలిని చూసుకోవడానికి ఆయన కుమార్తె అమెరికా నుండి విశాఖపట్నంకు వచ్చారు. ఐదారు రోజులుగా హాస్పిటల్‌ లో చికిత్స తీసుకుంటున్న బాలి నిన్న అర్థరాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు మంగళవారం వైజాగ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బాలి అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. 1941 సెప్టెంబర్‌ 29న అనకాపల్లిలో జన్మించారు. అక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తయింది. చిన్నతనం నుంచి బాలికి చిత్రలేఖనంపై ఆసక్తి ఉండేది. ఇంటి ముందు వాళ్ల అక్క వేసే ముగ్గులను చూసి డ్రాయింగ్స్‌ వేయడం మొదలుపెట్టారు. సొంతంగానే చిత్రలేఖనంలో ప్రావీణ్యం సాధించాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా చేరారు. కానీ చిత్రలేఖనంపై మక్కువతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

1970ల్లో అప్‌కమింగ్‌ ఆర్టిస్టుల కోసం ఆంధ్రపత్రిక నిర్వహించిన పోటీల్లో వరుసగా మూడుసార్లు బహుమతి గెలుచుకున్నారు. 1974లో ఈనాడు న్యూస్‌ పేపర్‌లో విశాఖపట్నం ఎడిషన్‌లో కార్టూనిస్ట్‌గా చేరారు. 1976లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో స్టాఫ్‌ ఆర్టిస్ట్‌గా చేరిన తర్వాత ఆయన కెరీర్‌ ఊపందుకుంది. ఆయనలోని ప్రతిభను చూసిన అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ పురాణం సుబ్రహ్మణ్య శర్మ.. మేడిశెట్టి శంకరరావు పేరును బాలిగా మార్చారు.

బాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. కార్టూన్‌ చిత్రాలతో 8 పుస్తకాలు రాశారు. మరెన్నో కథలు కూడా రాశారు. జోక్స్‌ పై సంకలనమే ఇచ్చారు. బాధాకర విషయం ఏంటంటే … ఆయన భార్య ధనలక్ష్మి 2010లోనే మృతి చెందారు. కుమారుడు గోకుల్‌ కూడా ఇటీవల మంచు ప్రమాదంలో చిక్కుకొని వేరొకరిని రక్షించబోయి మృతి చెందారు. బాలి కుమార్తె వైశాలి అమెరికాలో ఉంటున్నారు.

బాలి మృతిపట్ల పలువురు కళాకారులు, కార్టూనిస్టులు సంతాపం తెలిపారు. తమ ఆత్మీయ మిత్రుడు , ప్రముఖ చిత్రకారుడు బాలి అస్తమించాడన్న వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది అమెరికాలో కుమారుని మరణమే బాలిని కుంగదీసిందని స్మరించుకుంటూ సంతాపం ప్రకటించారు.