మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తున్న – కోమటిరెడ్డి రాజగోపాల్

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు తీర్పును గౌరవిస్తున్న అన్నారు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 11 ,666 ఓట్ల తేడాతో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..రాజగోపాల్ ఫై గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి నువ్వా నేనా అన్నట్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడిచింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన కారు..11వ రౌండ్ నుంచి దూకుడు పెంచింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రౌండ్ లోను ఆధిక్యం కనపరచలేకడిపాజిట్ కోల్పోయింది.

ఇక పరాజయం ఫై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే బై పోల్ లో నైతిక విజయం తనదేనని స్పష్టం చేశారు. పోలింగ్ జరిగే సమయం (నవంబరు 3) దాకా టీఆర్ఎస్ కు చెందిన 100 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌరవ సైన్యం మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురి చేసిందని మండిపడ్డారు. వాస్తవానికి అక్టోబరు 31వ తేదీ సాయంత్రం వరకు బీజేపీ ముందంజలో ఉందని గుర్తు చేశారు.

నవంబరు 1 తర్వాత ఇక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు భయానక వాతావరణాన్ని సృష్టించి బీజేపీ కార్యకర్తలను బెదిరించారని ఆరోపించారు. తన ఒక్కడిని ఓడగొట్టేందుకు టీఆర్ఎస్ కౌరవ సైన్యం మొత్తం మునుగోడుకు వచ్చిందన్నారు. దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయడం మొట్టమొదటిసారిగా మునుగోడులోనే జరిగిందని చెప్పారు. రిటర్నింగ్ ఆఫీసర్ పై కేసీఆర్, కేటీఆర్ బాగా ఒత్తిడి తీసుకొచ్చి తప్పులు చేయిస్తే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందన్నారు. ‘‘ ధర్మం వైపు ప్రజలు నిలిచి పోరాటం చేశారు. నిజానికి మేం గెలిచినట్టే. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిసిపోయింది. భవిష్యత్తులో తెలంగాణలో రాబోయే మార్పుకు ఇది సూచిక’’ అని వ్యాఖ్యానించారు.