ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై పవన్ ఆగ్రహం

Pawan Kalyan Reacts on NTR Health University Name Change

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాస్త వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మారింది. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన ఈ యూనివర్సిటీకి ఇప్పుడు ఎన్టీఆర్ పేరును తొలగించి వైస్సార్ పేరు పెట్టింది జగన్ సర్కార్. బుధవారం మంత్రి రజనీ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. దీనిపై టీడీపీ ,బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ పేరు మార్పు ఫై జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా మండిపడ్డారు. పేర్లు మార్చడం ద్వారా పాలకులు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పేరు బదులు వైఎస్సార్ పేరు పెడితే వర్సిటీలో వసతులు మెరుగవుతాయా అని నిలదీశారు. విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థం లేని చర్యగా అభివర్ణించారు. కొత్త వివాదాలను సృష్టించేందుకే వైస్సార్సీపీ ప్రభుత్వం ఈ పని చేసిందని ధ్వజమెత్తారు. అంతగా, అవసరమైతే విశాఖపట్నంలోని కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రి పేరు మార్చవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టమేంటని నిలదీశారు. ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల పేర్లను ఎందుకు పెట్టరని పవన్‌ కళ్యాణ్ నిలదీశారు.