ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే అగ్నిపథ్‌ – మంత్రి హరీష్ రావు

ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే అగ్నిపథ్‌ పధకాన్ని కేంద్రం తీసుకొచ్చిందని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. అగ్నిపథ్‌ పథకం ఫై యావత్ ఆర్మీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లు సర్వీస్‌ అంటూ కేంద్రం తమను పిచ్చివాళ్లను చేస్తోందని సైనిక నియామక రిక్రూట్‌మెంట్‌కు ప్రిపేర్‌ అవుతున్న నిరుద్యోగ యువకులు మండిపడుతున్నారు. బీహార్, రాజస్థాన్‌లలో మొదలైన ఆందోళనలు..ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. ప్రతి రాష్ట్రంలో విద్యార్థులు ఈ పధకాన్ని రద్దు చేయాలంటూ రోడ్ల పైకి వస్తున్నారు. బీజేపీయేతర పార్టీలు సైతం ఈ పధకాన్ని రద్దు చేయాలంటూ కోరుకుంటున్నారు. రైతు చట్టాలు లాగే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని మండిపడుతున్నారు.

తాజాగా ఈ పథకంపై మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు. ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చిందని ఆక్షేపించారు. అసంబద్ధ పథకం వల్లే దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయని ఫైర్ అయ్యారు. రక్షణ రంగంలోనూ ప్రైవేటీకరణ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ ఘటనలో యువకుడు చనిపోవడం దురదృష్టకరమన్నారు. అల్లర్ల వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని బీజేపీ ఆరోపించడం సిగ్గు చేటు అన్నారు.

సికింద్రాబాద్ ఆందోళనలో టీఆర్ఎస్ ప్రమేయం ఉంటే..బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటనలు వెనుక అక్కడి అధికార పార్టీలు ఉన్నాయా అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు నిరసనలు తెలుపుతున్నారని తెలిపారు. అగ్నిపథ్‌లో యువకులను తీసుకుని..నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి భవిష్యత్‌ ఏం కావాలని సూటిగా ప్రశ్నించారు. మొదటి నుంచి మోదీ ప్రభుత్వ మాటలు తీయగా..చేతలు చేదుగా ఉన్నాయని మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.