బండి సంజయ్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్

పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారం లో ఎంపీ బండి సంజయ్ పాత్ర ఉందంటూ వారిని వెంటనే లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేసారు. బిఆర్ఎస్ తో పోటీపడలేక బిజెపి నేతలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఈ సందర్బంగా ఆయన అన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో పెట్టిన ప్రశాంత్‌ది బీజేపీ సోషల్‌ మీడియా విభాగంలో కీలక పాత్ర అని సుమన్ అన్నారు.

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. బిజెపి చిల్లర పనులకు తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. ఎంపీగా బండి సంజయ్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని స్పీకర్‌ను కోరారు. బండి సంజయ్‌పై పీడీ యాక్ట్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు.

మరోపక్క సంజయ్ అరెస్టును వరంగల్ సీపీ రంగనాథ్ ధృవీకరించారు. మొత్తం మూడు కేసులు సంజయ్ ఫై నమోదు చేశారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్ హస్తం ఉన్నట్లు నిర్ధారించారు. వాటి ఆధారంగానే మొత్తం మూడు కేసులు నమోదు చేశారు.. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్ ప్రాక్టీస్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు.