జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వాలంటీర్ వ్యవస్థ ఫై హరిరామ జోగయ్య లేఖ రాసారు. వాలంటీర్ల సమస్యని ప్రస్తావిస్తూ.. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. సుమారు రెండున్నర లక్షల మంది నెలకు 5000 చాలీచాలని జీతాలతో బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థలో అధిక శాతం వైసీపీ వారే ఉన్నారనేది వాస్తవమని ఆయన అన్నారు.

రాష్ట్ర ఎన్నికల మెమో 818 ప్రకారం.. వాలంటీర్ వ్యవస్థలో వైస్సార్సీపీ వారు ఎక్కువగా ఉండటం వల్లే, ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థని ఉపసంహరించుకోవాలని జీవో ఇవ్వడం జరిగిందని అన్నారు. వాలంటీర్లను సంక్షేమ పథకాల అమలు కంటే.. అధికార పార్టీ తన ప్రయోజనం కోసమే ఎక్కువగా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. అవసరమైతే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలన్న పవన్ సంకల్పం మంచిదేనని సమర్థించారు.

ఈ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం కన్నా, కొన్ని ప్రతిపాదనలతో పునర్నిర్మించుకుంటే మంచిదని హరిరామ జోగయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న రెండున్నర లక్షలమంది మహిళలకు వాలంటీర్ ఉద్యోగాలు కల్పించాలని ఆకాంక్షించారు. వాలంటీర్లకు కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలని, వారికి కనీస వేతనం రూ.10 వేలు కేటాయించాలని కోరారు. జనాభా నిష్పత్తిలో కులాలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్‌లో సంవత్సరానికి 8 లక్షల ఆదాయం మించని కుటుంబాలకే ఉద్యోగం అందాలన్నారు. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన నియామక కమిటీలను ఏర్పాటు చేసి.. అర్హులైన వారికే ఉద్యోగ లబ్ధి కలిగించాలన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన వారిని వాలంటీర్లుగా నియమించకూడదని డిమాండ్ చేశారు.