తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసాయి. ఏపీలో అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలో 2, ఏపీలో 13 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసాయి. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 3 లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే 5 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 60.88 శాతం పోలింగ్ నమోదైంది. కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 85.24 శాతం పోలింగ్ నమోదైంది.

కాగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలింగ్ కేంద్రం వద్ద మాత్రం వైస్సార్సీపీ- టీడీపీ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నగరంలోని సెయింట్‌ థెరిసా పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఓటర్లకు సాయం చేసే క్రమంలో వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ధీంతొహ్ టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, ఇతర నేతలు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు వైస్సార్సీపీ నేతల సమాచారంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరుపార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు.