కొత్త ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్లుగా జ్ఞానేష్‌కుమార్‌, సుఖ్‌భీర్ సింగ్ సంధు నియామకం

Gyanesh Kumar, Sukhbir Sandhu to be new Election Commissioners, says Adhir Ranjan Chowdhury

న్యూఢిల్లీః ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ముగ్గురు స‌భ్యుల సెల‌క్ష‌న్ క‌మిటీ ఇద్ద‌రు కొత్త ఎన్నిక‌ల క‌మిష‌నర్ల‌ను నియ‌మించింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లుగా కేర‌ళ‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్‌కుమార్‌, పంజాబ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ సుఖ్‌భీర్ సింగ్ సంధుల‌ను ఎంపిక చేసింది. ఈ విష‌యాన్ని క‌మిటీ స‌భ్యుల‌లో ఒక‌ర‌యిన‌ కాంగ్రెస్ లీడ‌ర్‌ అధిర్ రంజ‌న్ చౌద‌రీ మీడియాతో వెల్ల‌డించారు. ఇక లోక్ స‌భ ఎన్నిక‌ల ముందు ఇటీవ‌ల అరుణ్ గోయ‌ల్ త‌న ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ప‌ద‌వీకి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. దీంతో అలా అరుణ్ గోయ‌ల్ త‌ప్పుకున్న రోజుల వ్య‌వ‌ధిలోనే ఈ కొత్త నియ‌మ‌కాలు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

అలాగే ఎన్నిక‌ల క‌మిష‌నర్ల నియామ‌కాల కోసం ఏర్ప‌డిన సెల‌క్ష‌న్ క‌మిటీ ఏర్పాయిన‌ త‌ర్వాత జ‌రిగిన మొద‌టి నియామ‌కాలు కూడా ఇవే. లోక్ స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్ర‌క‌టించ‌డానికి ఇంక కొన్ని రోజులే ఉంద‌న‌గా ఎల‌క్ష‌న్ క‌మిష‌ర్ అనుప్ పాండే ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప‌ద‌వివీర‌మ‌ణ చేశారు. అటు అరుణ్ గోయ‌ల్ త‌న ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ప‌ద‌వీకి రాజీనామా చేశారు. దీంతో ముగ్గురు సభ్యులు ఉండే కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ ఒక్క‌రే మిగిలారు. దీంతో తాజాగా ఇద్ద‌రు క‌మిష‌న‌ర్ల‌ను సెల‌క్ష‌న్ క‌మిటీ నియ‌మించింది.

ఇక గతేడాది ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్లు, ఎన్నిక‌ల క‌మిష‌నర్ల నియామ‌కాల విష‌య‌మై దేశ అత్యున్న న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సూచ‌న మేర‌కు ప్ర‌ధాని నేతృత్వంలో ముగ్గురు స‌భ్యుల సెల‌క్ష‌న్ క‌మిటీ ఏర్పాటు అయిన విష‌యం తెలిసిందే. ఈ క‌మిటీలో ప్ర‌ధానితో పాటు లోక్ స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత‌, సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ స‌భ్యులుగా ఉంటార‌ని కోర్టు సూచించింది.

కాగా, ఈ సెల‌క్ష‌న్ క‌మిటీలో ప్ర‌ధాన‌మంత్రితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్ స‌భ‌లో కాంగ్రెస్ నాయ‌కుడు అధిర్ రంజ‌న్ చౌద‌రి కూడా ఉన్నారు. గురువారం ప్ర‌ధాని మోడీ అధ్యక్ష‌త‌న ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ భేటీ అయింది. అనంత‌రం న్యాయ‌శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌, హోంశాఖ కార్య‌ద‌ర్శి, శిక్ష‌ణ వ్య‌వ‌హారాలశాఖ కార్య‌ద‌ర్శి స‌భ్యులుగా ఉన్న సెర్చ్ క‌మిటీ ప్ర‌తిపాదించిన పేర్ల జాబితాపై చ‌ర్చించి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు.