మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం – గుత్తా సుఖేందర్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నిక..ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఈ ఉప ఎన్నికను టిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాలని సన్నాహాలు చేస్తున్నాయి. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. భారీ సభలు , సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

అయితే ఈ ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి కి ఓటమి ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి జోస్యం చెప్పారు. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్గా ఉండి ప్రచారానికి వెళ్లకపోవడం విడ్డూరమన్నారు. ఆయన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. మునుగోడులో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2023లో కూడా టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం లేదన్న ఆయన.. కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయడమే బీజేపీ తన పనిగా పెట్టుకుందని ఆరోపించారు.