మందేసుకుంటే ‘మందు’ ఫ్రీ

మందేసుకుంటే ‘మందు’ ఫ్రీ

కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ మహమ్మారి బారి నుండి పలు దేశాలు కోలుకోకముందే, కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు మరోసారి విజృంభిస్తోంది. దీంతో పలు దేశాలు మరోసారి లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే కరోనా సోకకుండా ఉండే ఏకైక మార్గం వ్యాక్సిన్ వేసుకోవడమే అని వైద్యులు చెబుతున్నారు. కానీ కొన్ని అపోహల కారణంగా ఈ వ్యాక్సిన్‌ను వేసుకునేందుకు జనం భయపడి ముందుకు రావడం లేదు.

దీంతో ప్రజల్లో కోవిడ్ వ్యాక్సిన్‌పై అవగాహన తీసుకొచ్చేందుకు గుర్గావ్‌లోని ఓ రెస్టారెంట్ వినూత్న ప్రయత్నం చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి తమ రెస్టారెంట్‌లో ఫ్రీ మందు ఇస్తున్నట్లు ఆ రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నట్లు కార్డు చూపితే, తమ రెస్టారెంట్‌లో ఫ్రీగా బీరు తాగొచ్చంటూ సదరు యాజమాన్యం ఆఫర్ ప్రకటించింది. ‘ఇండియన్ గ్రిల్ రూమ్‌తో మీ టీకాను జరుపుకోండి’ అనే ప్రచారంతో గుర్గావ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ రెస్టారెంట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న మందుబాబులు, వెంటనే వ్యాక్సిన్ మందు వేసుకుని, అటుపై ఫ్రీ మందు కోసం సదరు రెస్టారెంట్ ముందు వాలిపోతున్నారట. ఈ ఆఫర్ పెట్టిన దగ్గర్నుండి తమ రెస్టారెంట్‌కు మందుబాబుల తాకిడి పెరిగిందని సదరు యాజమాన్యం పేర్కొంది. అయితే ఈ ఫ్రీ బీర్ ఆఫర్‌ను ఏప్రిల్ 5న ప్రారంభించి వారం రోజుల పాటు ఉంచబోతున్నట్లు ఆ రెస్టారెంట్ ఓనర్ చెప్పుకొచ్చాడు.