తారక్ నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్‌తో కాదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే ఎన్టీఆర్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసిన సంగతి తెలిసిందే.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు తారక్. అయితే ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించే ప్రయత్నం కూడా చిత్ర యూనిట్ చేస్తున్నట్లు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా కంటే ముందే తారక్ మరో డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తారక్‌కు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ డైరెక్షన్‌లో తారక్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

కొరటాల ఇప్పటికే ఆచార్య చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. దీంతో ఆచార్య చిత్రం తరువాత అతి తక్కువ సమయంలో ఓ సినిమా చేయాలని ఆయన భావిస్తున్నాడట. అందుకే తారక్‌ను ఈ విషయమై అడగగా, తారక్ వెంటనే ఓకే చెప్పేశాడట. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. అయితే తారక్ రెండు సినిమాలు ఒకేసారి ముగించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. మరి తారక్ ఆర్ఆర్ఆర్ తరువాత ఏ డైరెక్టర్‌కు ఓటేస్తాడో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.