బర్త్‌డే పార్టీ జరుపుకున్న ప్రధాని.. బెండు తీసిన పోలీసులు!

దేశానికి దారి చూపే ప్రధానమంత్రి తప్పు చేస్తారా? ఒకవేళ తప్పు చేస్తే దానికి వారికి శిక్ష పడుతుందా? అనే ప్రశ్న సగటు ప్రజలకు ఎప్పుడూ ఉంటుంది. అయితే చట్టం ముందు ప్రధానమంత్రి అయినా, సామాన్య మానవుడైనా ఒకరే అంటుంటారు. దీనికి తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణగా నిలిచిందని చెప్పాలి. దేశ ప్రధాని కరోనా నియమావళిని తుంగలో తొక్కితే పోలీసులు ఏం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తుండటంతో పలు దేశాల్లో కఠినమైన రూల్స్ పెట్టారు అక్కడి ప్రభుత్వాలు. కాగా నార్వే దేశంలో కూడా కరోనా వ్యాప్తిని అరికట్టేందుక ఎలాంటి బహిరంగ సభలు, పార్టీలు జరుపుకోవద్దంటూ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఆ దేశ ప్రధాని తన పుట్టినరోజు వేడుకను కోవిడ్ రూల్స్‌కు విరుద్ధంగా జరుపుకుంది. నార్వే ప్రధాని ఎర్నా సోల్బర్గ్ తన 60వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. అయితే నార్వేలో ఏదైనా పార్టీకి కేవలం 10 మందికి మాత్రమే అనుమతులు ఉన్నాయి.

కానీ నార్వే ప్రధాని జరుపుకున్న బర్త్‌డే పార్టీలో ఏకంగా 13 మంది పాల్గొన్నారు. దీంతో కరోనా రూల్స్‌ను బ్రేక్ చేసిన కారణంగా ఎర్నా సోల్బర్గ్‌ను ఆ దేశ ప్రజలు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు ఆమెకు ఏకంగా రూ.1.75 లక్షల జరిమానా విధించారు. దీంతో చట్టం నుండి ప్రధాని కూడా తప్పించుకోలేరనే విషయాన్ని నార్వే పోలీసులు నిరూపించారు.