కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ : హార్దిక్‌ పటేల్‌ రాజీనామా

కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. పార్టీ కి హార్దిక్‌ పటేల్‌ రాజీనామా చేసారు. గుజరాత్ అసెంబ్లీకి మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండగా… పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ రాజీనామా చేయడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.

అంతర్గత పోరుతో హార్దిక్ పటేల్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి, గుజరాత్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తన సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని..భవిష్యత్తులో గుజరాత్ అభివృద్దికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసినట్టు తెలిపారు.

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీపై హార్దిక్ విమర్శలు చేస్తున్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లేదని, పార్టీలో అంతర్గత పోరులు సైతం తారా స్థాయిలో ఉన్నాయంటూ హర్దిక్ పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే ఒకానొక సమయంలో ఈ కుమ్ములాటలను పార్టీ చక్కదిద్దుతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ వాస్తవంలో అలాంటిదేమీ జరగలేదని హార్దిక్ రాజీనామా చెబుతోందని తెలుస్తుంది.