గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

డిసెంబ‌ర్ 1, 5వ తేదీల్లో గుజ‌రాత్ ఎన్నిక‌లు.. 8న ఫ‌లితాలు

Gujarat Assembly Election Schedule Released

న్యూఢిల్లీః గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌. రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన తొలి ద‌ఫా, అయిద‌వ తేదీన రెండో ద‌ఫా ఎన్నిక‌లను నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడుత‌లో 89 స్థానాల‌కు, రెండ‌వ విడుత‌లో 93 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. గుజ‌రాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జ‌న‌ర‌ల్ 142, ఎస్టీ 13, ఎస్సీ 27 స్థానాలు ఉన్న‌ట్లు సీఈసీ వెల్ల‌డించారు. 51,782 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. అర్బ‌న్ ప్రాంతాల్లో 17506, రూర‌ల్ ఏరియాలో 34276 పోలింగ్ బూత్‌ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. 182 మోడ‌ల్ పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 4,90,89765. దీంట్లో తొలిసారి 4,61,494 మంది ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బిజెపి 111 స్థానాలు గెలుచుకున్న‌ది. ఈ సారి కాంగ్రెస్‌, ఆప్‌, బిజెపి మ‌ధ్య ర‌స‌వ‌త్త‌ర పోరు త‌ప్ప‌దు. గుజ‌రాత్ అసెంబ్లీ ఫిబ్ర‌వ‌రి 18, 2023లో ముగియ‌నున్న‌ది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ ఎన్నిక‌ల‌కు ప్ర‌త్యేక అబ్జ‌ర్వ‌ర్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. మ‌హిళ‌లు, వృద్ధులపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌నున్నారు. 4.90 కోట్ల మంది ఓట‌ర్ల‌లో పురుషులు 2.53 కోట్లు, మ‌హిళ‌లు 2.37 కోట్లు, మూడ‌వ జెండ‌ర్‌కు చెందిన 1,417 మంది ఓట‌ర్లు ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/