మాండస్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్

Cyclone Mandus

మాండస్ తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. చేతికి వచ్చిన పంట నేలపాలైంది. అకాల వర్షానికి రైతులు తీవ్ర నష్టపోయారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. ఓ వైపు గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వ సహాయ సహకారాలు అందక అల్లాడిపోతున్న రాష్ట్ర రైతులను మాండూస్ తుపాను కూడా దెబ్బతీసిందని పవన్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలు చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో లక్షల ఎకరాల్లో వరిపంట నీటపాలైందని, పత్తి వంటి వాణిజ్య పంటతో పాటు బొప్పాయి, అరటి వంటి పండ్ల తోటలు కూడా తుపాను ధాటికి నేల రాలాయని తెలిపారు.

తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన అండను ఇవ్వాలని తెలిపారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకు సహేతుకమైన నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పడంలేదని జనసేనాని విమర్శించారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలను తిట్టడానికి వరుసగా నేతలను పంపుతూ, ఏ తిట్లు తిట్టాలో కూడా స్క్రిప్టులు అందించే తాడేపల్లి పెద్దలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండాలని తమ నాయకులకు ఎందుకు చెప్పరని పవన్ ప్రశ్నించారు.