విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు

విదేశాల నుంచి వచ్చే వారికి ‘నో క్వారంటైన్’.. 14 రోజుల పరిశీలన..

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దశలో ‘కొన్ని దేశాలను’ రిస్క్ ఎక్కువ ఉన్నవిగా కేంద్రం ప్రకటించింది. తాజాగా ఈ రిస్క్ కేటగిరీని తొలగించింది.

ముఖ్యంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ అవ్వాలన్న నిబంధనను ఎత్తివేసింది. దీని స్థానంలో విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు లక్షణాలను పరిశీలించుకుంటూ ఉండాలని తెలిపింది. నూతన మార్గదర్శకాలు ఈ నెల 14 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మారుతున్న కరోనా వైరస్ తీరును గమనిస్తూ ఉండాలని, అదే సమయంలో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం.. విదేశాల నుంచి వచ్చే వారు స్వీయ ధ్రువీకరణను ఆన్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఎయిర్ సువిధ పోర్టల్ లో ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది. కరోనా నెగెటివ్ అంటూ ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్షా రిపోర్ట్ ను సమర్పించాలి. లేదంటే తాము రెండు డోసుల టీకా తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఇవ్వాలి. ఈ నిబంధనలను పాటించిన వారినే ప్రయాణానికి అనుమతించాలని ఎయిర్ లైన్స్ సంస్థలకు కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. ‘‘కరోనా లక్షణాలు లేని, మాస్క్ ధరించిన వారినే ప్రయాణాలకు అనుమతించాలి. భౌతిక దూరం పాటించాలి. గమ్యస్థానానికి చేరిన తర్వాత ప్రయాణికుల్లో కొందరికి ర్యాండమ్ గా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయాలి’’ అని పేర్కొంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/