శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవోత్సవంలో పాల్గొన్న గవర్నర్ తమిళసై

తెలంగాణ గవర్నర్ తమిళసై..శుక్రవారం ఉదయం యాదాద్రి శ్రీల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారు.మాడవీధుల్లో ఊరేగిన శ్రీస్వామి వారి సేవోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మార్చి 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ ప్రారంభమైంది.

మాడవీధుల్లో ఊరేగిన శ్రీస్వామి వారి సేవోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఉదయం యాదగిరి గుట్టకు చేరిన గవర్నర్.. మొదటగా స్వయంభూ నరసింహుడి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి వటపత్రశాయి అలంకార సేవలో పాల్గొన్నారు.అంతకుముందు ఆలయానికి చేరుకున్న గవర్నర్‌ తమిళిసైకి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈవో గీత, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల విషయానికి వస్తే..ఈరోజు రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ. 25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ నిర్వహిస్తారు. 26న ఉదయం 9 గంటలకు గోవర్దన గిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన అలంకార సేవ ఉంటుంది. 27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం మార్చి 1న ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది. మార్చి 2న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన ఉంటుంది. 3న ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తమవుతాయి.