రైతుబంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రైతుబంధు (రైతుభరోసా) ఆర్థిక సాయం పంపిణీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీజన్కు ముందు కాకుండా మధ్యలో లేదా చివర్లో డబ్బులు జమ చేయాలని యోచిస్తోంది. అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందనేది సర్కార్ ఆలోచన. అది కూడా ఐదెకరాలలోపు రైతులకే అందించనున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది.

రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్‌ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం.

ఈ క్రమంలో సీజన్‌కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్‌లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి.