పాన్-ఆధార్ అనుసంధానానికి గడువు పెంచిన కేంద్రం

పాన్-ఆధార్ అనుసంధానానికి కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. గతంలో విధించిన గడువు మార్చి 31న ముగియనుంది. ఈసారి మరో మూడు నెలలు పొడిగిస్తూ, జూన్ 30న తుది గడువు అని పేర్కొంది. అందుకు అపరాధ రుసుము రూ.1000 అని తెలిపింది. అప్పటిలోగా పాన్ తో ఆధార్ అనుసంధానించకపోతే జులై 1 నుంచి పాన్ కార్డు పనిచేయదు. ఈ మేరకు తాజాగా మార్చి 28న ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది.

పన్ను చెల్లింపుదారులకు మరింత సమయాన్ని అందించేందుకు.. పాన్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం చేసుకునేందుకు చివరి తేదీని జూన్ 30 వరకు పొడగించినట్లు సీబీడీటీ వివరించింది. ఆ తేదీ వరకు ఎలాంటి అంతరాయం లేకుండా పాన్, ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆధార్, పాన్ లింక్ డెడ్‌లైన్‌ను పొడగించడం సీబీడీటీకి ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఇక ఆధార్, పాన్ లింక్ చేసుకోకుంటే.. పాన్ కార్డు పనిచేయదనే విషయం తెలిసిందే.