రైతుల‌కు గుడ్ న్యూస్ : మే 31వ తేదీన రైతుల ఖాతాల్లోకి కిసాన్ డబ్బులు

ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న ల‌బ్ధిదారుల‌కు కేంద్రం తీపి కబురు తెలిపింది. 11వ విడ‌త ఈ ప‌థ‌కం కింద రూ.21,000 కోట్ల‌కుపైగా నిధుల‌ను మే 31వ తేదీన రైతుల ఖాతాల్లోకి జ‌మ చేయబోతుంది. కేంద్ర ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా ఉన్న చిన్న‌, స‌న్న కారు రైతుల‌కు పంట పెట్టుబ‌డి సాయం కింద ఏడాదికి మూడు విడ‌త‌ల్లో రూ.6వేలు జ‌మ చేస్తుంది. తాజాగా ఈ ఏడాది రెండ‌వ విడ‌త న‌గ‌దును ప్ర‌ధాని విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇప్పటి వరకు లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నిధులను కేంద్రం జ‌మ చేసింది. అయితే 11వ విడ‌తలో భాగంగా ఈ-కేవైసీ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. అర్హులైన ల‌బ్ధిదారుల‌కు మాత్ర‌మే ఈ న‌గ‌దు చేరేలా, ప‌థ‌కంలో అవినీతిని అరిక‌ట్టేందుకు కేంద్రం ఈ విధానాన్ని అమ‌లు చేస్తోంది. ఇందుకుగాను మే 31వర‌కు చివ‌రి తేదీని ప్ర‌క‌టించింది. అయితే అదే రోజు పీఎం కిసాన్ స‌మ్మాన్ ప‌థ‌కం నిధులు రైతుల ఖాతాల్లో జ‌మ‌కానుండ‌టం గ‌మ‌నార్హం.

2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో నరేంద్ర మోడీ ఈ పథకాన్ని మొట్టమొదటిగా ఒక కోటి మంది రైతులకు 2,000 నగదు బదిలీ చేయడం ద్వారా ప్రారంభించారు. దేశంలోని చిన్న‌, స‌న్నకారు రైతుల‌కు కొంత‌మేర ఆర్థికంగా వెసులుబాటు క‌ల్పించేందుకు ఈ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తుంది. ఈ ప‌థ‌కం కింద ఏడాదికి రూ.6వేలు మూడు విడ‌త‌ల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇప్ప‌టికే ప‌ది విడ‌త‌లుగా కేంద్ర రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున న‌గ‌దు జ‌మ‌చేసింది. ఇప్పటి వరకు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకంపై రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసింది.