రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావ‌డం ఖాయ‌ంః గులాం న‌బీ ఆజాద్

ghulam-nabi-azad

న్యూఢిల్లీ : డెమోక్ర‌టిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్య‌క్షుడు గులాం న‌బీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావ‌డం ఖాయ‌మ‌ని ఆయన పేర్కొన్నారు. ఇప్ప‌టికే చాలా మంది సీనియ‌ర్లు పార్టీని వీడడం ఆ పార్టీ దుర‌దృష్ట‌క‌రం అన్నారు. మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ చ‌వాన్ కాంగ్రెస్ పార్టీని వీడడం పార్టీకి పెద్ద‌దెబ్బ అని ఆజాద్ తెలిపారు. భ‌విష్య‌త్‌లో మ‌రికొంత మంది కాంగ్రెస్‌ను వీడుతున్న‌ట్లు త‌న‌కు స‌మాచారం ఉంద‌న్నారు. ఇప్పుడు తాను ఆ పార్టీలో లేను కాబ‌ట్టి.. కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల గురించి తాను మాట్లాడ‌ద‌ల‌చుకోలేద‌ని ఆజాద్ స్ప‌ష్టం చేశారు.

అయితే అశోక్ చ‌వాన్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుద‌ల‌కు ఎంతో కృషి చేశార‌ని తెలిపారు. వారి తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని గుర్తు చేశారు. త‌న లెజిస్లేటివ్ కేరీర్ మ‌హారాష్ట్ర‌తోనే ప్రారంభ‌మైంద‌న్నారు. అక్క‌డ్నుంచే తాను లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యాన‌ని గుర్తు చేశారు. రాజ్య‌స‌భ‌కు కూడా మ‌హారాష్ట్ర నుంచే వెళ్లాను అని తెలిపారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పున‌రుద్ధ‌రించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మ‌హారాష్ట్ర మాత్ర‌మే. యూపీ, బెంగాల్ వంటి రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేశాయ‌న్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ పార్టీ అంతం కాబోతుంద‌ని, అది దురదృష్ట‌క‌ర‌మ‌ని గులాం న‌బీ ఆజాద్ పేర్కొన్నారు.