గాజాపై దాడులను ఆపే ప్రసక్తే లేదు..కాల్పులను ఆపితే హమాస్ కు లొంగిపోయినట్టేః నెతన్యాహు

గాజాలో తమ సైన్యం మరింత విస్తరించిందని వెల్లడి

‘Gaza ceasefire will not happen’: Israel PM Benjamin Netanyahu

జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ దాడుల కారణంగా గాజా శిథిలమైపోతోంది. మరోవైపు దాడులను ఆపాలని ఇజ్రాయెల్ ను పలు దేశాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాపై దాడులను ఆపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. హమాస్ ను అంతం చేసేంత వరకు దాడులు కొనసాగుతాయని చెప్పారు. తాము కాల్పులను ఆపితే హమాస్ కు లొంగిపోయినట్టు అవుతుందని అన్నారు. గాజా స్ట్రిప్ లో తమ సైన్యం మరింత విస్తరించిందని చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో 8,300 మంది చనిపోయినట్టు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన గాజాలో కొనసాగుతున్న దాడుల్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. దాడుల్ని ఆపితే హమాస్‌కు లొంగిపోయినట్లు అవుతుందని చెప్పారు. అలా ఎప్పటికీ జరగదని తెలిపారు. హమాస్‌ వద్ద బందీలుగా ఉన్నవారిని విడిపించడంలో ప్రపంచ దేశాలు తమకు సాహాయం చేయాలని కోరారు.

అక్టోబర్‌ 7 నాటి హామాస్‌ దాడి తర్వాత ఇజ్రాయెల్‌ సైన్యాలు గాజాపై భూతల, గగణ తల దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో ఇప్పటిరకు గాజాలో 8300 మంది మరణించారని హమాస్‌ ప్రకటించింది. కాగా, హమాస్‌ దాడుల్లో 1400 మంది ఇజ్రాయెలీ పౌరులు మరణించారని, 230కిపైగా మందిని బందీలుగా తీసుకెళ్లారని నెతన్యాహూ వెల్లడించారు. మొదటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్న అమెరికా కూడా కాల్పుల విరమణ ప్రతిపాదనను వ్యతిరేకించడం గమనార్హం.