విడాకులు తీసుకుంటున్న ఫిన్లాండ్‌ ప్రధాని

మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి.. విడాకులకు దరఖాస్తు చేసుకున్న సనా మారిన్‌

Finland’s PM Sanna Marin files for divorce

హెల్సింకి: ఫిన్లాండ్‌ ప్రధాన మంత్రి సనా మారిన్‌ తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. భర్త మార్కస్‌ రైకోనెన్‌ నుంచి విడిపోనున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. తాము విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. ‘మేమిద్దరం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులం. కలిసి పెరిగాం. 19 ఏళ్లుగా కలిసే ఉన్నాం. ఇప్పుడు మేమిద్దరం విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం. ఇకపై మంచి స్నేహితులుగానే ఉంటాం. మా ప్రియమైన కుమార్తెకు తల్లిదండ్రులమే. ఒక కుటుంబంగా మా కుమార్తె కోసం సమయాన్ని వెచ్చిస్తాం’ అని సనా మారిన్‌ చెప్పుకొచ్చారు.

వ్యాపారవేత్త, మాజీ ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌ అయిన మార్కస్‌ రైకోనెస్‌తో సనా మారిన్‌ కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. 2019లో సనా ఫిన్లాండ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత.. 2020లో ఆగస్టులో వీరు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఐదేళ్ల కుమార్తె ఉంది. అయితే పెళ్లైన మూడేళ్లకే ఈ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ తాజాగా విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని అందరికీ షాక్‌ ఇచ్చారు.