వంద రోజుల్లో రూ.500కు గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ అమలు చేస్తాంః మంత్రి ఉత్తమ్

ప్రజలకు ఇచ్చే 6 కిలోల బియ్యంలో కేంద్రం వాటానే 5 కిలోలు అని వెల్లడి

Gas cylinder for Rs 500 to be implemented in next 100 days: minister uttam kumar reddy

హైదరాబాద్‌ః రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై రాష్ట్ర పౌరసరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టతను ఇచ్చారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… రూ.500కు గ్యాస్ సిలిండర్, వరికి రూ.500 బోనస్ హామీలను వంద రోజుల్లో నెరవేర్చుతామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సివిల్ సప్లై శాఖ చాలా ముఖ్యమైనదని, రాబోయే వంద రోజుల్లో గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చిన హామీని, వరికి రూ.500 బోనస్ అందిస్తామన్నారు. ప్రజలకు ఇచ్చే బియ్యంలో కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు అందిస్తోందన్నారు. కానీ రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కేవలం ఒక కిలో బియ్యం మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులు రెండు లక్షలన ఎనభై వేల మంది ఉన్నట్లు తెలిపారు.

వడ్ల కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు వెంటనే డబ్బులు అందాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తోన్న రేషన్ పథకం పేదలకు అందకుంటే వృథా అన్నారు. రేషన్ పథకంపై ప్రజల నుంచి సమాచారం సేకరించాలన్నారు. తొమ్మిదిన్నరేళ్ల బిఆర్ఎస్ పాలనలో లోపాలున్నాయని, అన్ని శాఖల్లోనూ ఆర్థిక పరిస్థితి బాగా లేదన్నారు. రేషన్ తీసుకుంటున్న వారు 89 శాతం దాటడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డును ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయని, దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.