ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌కు చేదు అనుభవం

చేయి కలిపినట్టే కలిపి చెంపపై కొట్టిన దుండగుడు

పారిస్‌ : ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి మాక్రాన్‌ చెంపపగులగొట్టాడు. దేశ పర్యటనలో ఉన్న మేక్రాన్‌ మంగళవారం ఆగ్నేయ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లారు. ఆయనకు దారి పొడవునా ప్రజలు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ప్రజలను ఉత్సాహపరిచేందుకు మేక్రాన్‌ ఓ గ్రామంలో దిగి వారితో చేతులు కలిపేందుకు దగ్గరికి వెళ్లారు. ఇంతలో ఓ దుండగుడు షేక్‌ హ్యాండ్‌ ఇస్తున్నట్లే ఇచ్చి ఆయన చెంపపై కొట్టాడు.

వెంటనే స్పందించిన మేక్రాన్‌ భద్రతా సిబ్బంది దుండగుడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ సంఘటన భద్రతా వైఫల్యాలను సూచిస్తోందని పలువురు విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నాడిని తెలుసుకునేందుకే తాను దేశంలో పర్యటిస్తున్నానని మేక్రాన్ గతంలో ప్రకటించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/