ఫ్రాన్స్ లో మరో కొత్త వేరియంట్..ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి

‘ఐహెచ్ యూ’ అనే వేరియంట్ గుర్తింపు..ఇప్పటికే 46 ఉత్పరివర్తనాలు జరిగినట్టు నిర్ధారణ

పారిస్: ఓ వైపు ఒమిక్రాన్ కలకలం కొనసాగుతుండగానే మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా సోకుతూ టెన్షన్ పెడుతోంది. దాని కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలతో ఆందోళన కలిగిస్తోంది. ఆ కొత్త మ్యుటేషన్ పేరు ఐహెచ్ యూ (బీ.1.640.2). ఫ్రాన్స్ లోని ఐహెచ్ యూ మెడిటరనీ ఇన్ ఫెక్షన్ కు చెందిన సైంటిస్టులు ఈ కొత్త మ్యుటేషన్ ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్ కూ పెట్టారు. ప్రస్తుతం మార్సెయ్ అనే సిటీలో 12 కేసులను నిర్ధారించారు. వారంతా కూడా ఆఫ్రికా దేశమైన కామెరూన్ నుంచి వచ్చారని తేల్చారు.

ఈ వేరియంట్ లో 46 మ్యుటేషన్లు జరిగాయని, దీంతో ఒమిక్రాన్ కన్నా వేగంగా అది సోకుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. వ్యాక్సిన్లకు కూడా అది లొంగడం లేదని అంటున్నారు. కొత్త వేరియంట్ ముప్పు గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ వేరే దేశాల్లో లేదని డబ్ల్యూహెచ్ వో చెబుతోంది. దీనిని ‘వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్’ జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చింది. వేరియంట్ లోని కొమ్ము ప్రొటీన్లలో ఎన్ 501వై, ఈ484కే సహా 14 మార్పులు జరిగాయని, కరోనా వైరస్ లో ఉండే మరో 9 అమైనో యాసిడ్లు ఇందులో లేవని సైంటిస్టులు తేల్చారు. కాగా, కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయని, అలాగని అవి ప్రమాదకరమని అనుకోలేమని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీల్ డింగ్ చెప్పుకొచ్చారు. కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాలని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/